శ్యామ్ కర్ణ - బాబా గుర్రం

తన వ్యాపారంలో ఎక్కువగా లాభాలు సంపాదించిన శ్రీ సాయిబాబా భక్తుడు శ్రీ సాయిబాబాకు చక్కని గుర్రాన్ని సమర్పించాడు. శ్రీ సాయిబాబా దీనికి శ్యామ్ సుందర్ (లేదా శ్యామ్ కర్ణ) అని పేరు పెట్టారు మరియు దాని నిర్వహణ బాధ్యతను తుకారాం అనే భక్తుడికి అప్పగించారు. శ్యామ్ సుందర్‌ను ఒక జంతువుగా భావించవద్దని, దానిని శ్రీ సాయిబాబా బిడ్డగా భావించాలని సాయిబాబా చాలాసార్లు భక్తులకు చెప్పారు.

ఒక రోజు ఏదో తెలియని కారణాల వల్ల గుర్రం గడ్డి తినలేదు. తుకారాం చాలా ప్రయత్నం చేసాడు కాని గుర్రం గడ్డిని తినలేదు. తూకారం సహనం కోల్పోయి కోపంగా కర్రతో కొట్టాడు. ఇది మసీదు(తల్లి ద్వారాకమయి) నుండి కొంచెం దూరంలో జరిగింది. శ్రీ సాయి బాబా తుకారాంను పిలిచి కోపంగా అడిగారు, నువ్వు నన్ను ఎందుకు ఇంత పెద్ద కర్రతో కొట్టావు. తుబారం శ్రీ సాయిబాబా మాటలకు భయపడ్డాడు. అప్పుడు బాబా తన పొడవాటి చొక్కా (కాఫ్ని) పైకి ఎత్తి తన శరీరంపై కర్రతో కొట్టిన ఆకారంలో దెబ్బను చూపించారు. అది చూసిన అక్కడి వారు అందరు ఆశ్చర్యపోయారు ఇంకా భయపడ్డారు. వారు తుకారాం వైపు అనుమానాస్పదంగా చూశారు, కాని తుకారామ్ ఆ రోజు ద్వారకమై దగ్గరకు రాలేదని, బాబాను కొట్టలేదని చెప్పాడు. అప్పుడు శ్రీ సాయి బాబా, "మీరు నా బిడ్డ శ్యామ్ సుందర్‌ను కొడితే అది నన్ను కొట్టినట్లు కదా?" అని శ్రీ సాయిబాబా అన్నారు.

అంటే సర్వ జీవకోటిలో అన్ని ప్రాణులు సమానమే......అన్ని సాయి స్వరూపమే.....

నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం

అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై

"సత్యదర్శన సాధనలో నాకు అనుకూల మార్గం ఏమిటి ?"

ప్రాపంచిక విషయాలపై ఇష్టాన్ని తగ్గించుకోవటం, దైవంపై అంతకు మించిన ఇష్టాన్ని పెంచుకోవటం సాధనకు, సత్యదర్శనానికి మార్గం అవుతాయి. పేపర్ చదివేప్పుడు, టీవీ చూసేప్పుడు మనకిష్టమైన కాఫీ కప్పు చేతిలో ఉన్నా త్రాగటం మరిచిపోతాం. మనం వార్తల్లో, టీవీ దృశ్యాల్లో లీనం కావటమే అందుకు కారణం. ధ్యానం విషయంలో మాత్రం సాధకుడు ఆ మమైకతను సాధించటానికి చాలా కష్టపడాల్సివుంది. ప్రయత్నంతో పనిలేని సహజమైన ఆసక్తి ఉంటే ఏ కష్టం లేకుండానే ధ్యానం కూడా సిద్ధిస్తుంది. పరధ్యానంతో ఉన్నప్పుడు మన ఒళ్ళును మనం మర్చిపోతున్నాం. కానీ దైవాన్ని పూజించేప్పుడు, ఆత్మను ధ్యానించేప్పుడూ అది సాధ్యం కావడంలేదు. తగిన ఆసక్తి, జిజ్ఞాస లేకపోవటమే అందుకు కారణం. ప్రాపంచిక విషయాలపై ఉన్న ఇష్టం మనలోని దివ్యత్వాన్ని తెలుసుకోడానికి అడ్డు అవుతోంది. మనకి టీవీ గానీ, సినిమా గానీ స్పష్టంగా కనిపించాలంటే బయటి వెలుతురు తగ్గాలి. లేదా టీవీ కాంతి బాగా పెరగాలి. అలాగే ప్రాపంచిక విషయాలపై ఇష్టం తగ్గించుకొని, దైవ చింతనపై శ్రద్ధ పెంచుకుంటేనే నీవు ఆశించే సత్యదర్శనానికి మార్గం సులువవుతుంది !
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

మనిషికి గురువు అవసరం ఉన్నదా ?

మనిషికి గురువు అవసరం ఉన్నదా ? గురువులేక శిష్యులు జీవించలేరా ? గురువును గుర్తించినా ,గుర్తించకపోయినా ,ఆరాధించినా ,ఆరాధించకపోయినా ,గురువు శిష్యుణ్ణి మరవడం వుండదు .

అజ్ఞానం వల్లనో ,అహంకారం వల్లనో ,పదవి ,ధన ,కనక ,వస్తు వాహనాల మైకం వల్లనో ,స్త్రీ ,పుత్ర ,మిత్ర ,బంధు వ్యామోహాలవల్లనో శిష్యుడు గురువుని మరచినా శిష్యుణ్ణి మరవరన్న వాస్థవం
సాయిసచ్చరిత్రలో ఎన్నొ దృష్టాంతాలవల్ల తెలుస్తుంది .


గురువు కర్మలను తొలగించ లేనప్పుడు ,ఎవరి కర్మలు వారు అనుభవించాలి అని అన్నప్పుడు గురువుతో పని ఏమిటీ ? అన్న
హేమాడ్ పంత్ కు సాయిబాబా కనువిప్పు కలిగిస్తాడు ." అహంకారాన్ని వదలి నా చరిత్ర వ్రాయడానికి ప్రయత్నించు .నిన్ను సాధనంగా చేసుకుని నా కథను నేనే వ్రాసుకొంటాను "అని పలికాడు బాబా ." సాయిబాబా బుక్కా ఫకీర్ ,మోసగాడు " అనుకొంటూ బాబా దర్శనం చేసాడు బాలభాటే .


బాబా వెంటనే బాలభాటే పై ఒక వస్త్రం కప్పగానే ,అతడు ధ్యాన సమాధి స్ధితికి వెళ్ళిపోయి ,సాయిబాబా జగద్గురువు అని అంగీకరిస్తాడు ."గురువు మార్గదర్శకుడు ,అతని తోడులేనిదే అడవి వంటి సంసారాన్ని దాటలేవు "అని కాకాసాబ్ ధీక్షిత్ తో బాబాఉపదేశం చేసారు

మనం పూజలు ,చేసినంతమాత్రాన ,పుణ్యక్షేత్రాలు మనందర్శించినమాత్రాన మన కర్మలు నశించవు .నాసిక్ సమీపానగల సప్తశృంగి దేవత పుజారి అయిన
కాకాజీవైద్యకు మనసుకు శాంతిలేదు .పూజ ఉద్యోగ ధర్మము .పుణ్యం కాదు .అతడు సాయిబాబాను షిరిడీలో దర్శించినతరువాతే అతనికి మనశాంతి లభించింది .

మనం విలువైన వస్తువులను ,వ్యక్తులను కోల్పోతే తీవ్రనిరాశకు గురిఅవుతాం .అది సహజమే .చాంద్ పాటిలు అడవిలో గుర్రాన్ని వెతుకుంటూ వెళ్ళినప్పుడు ,బాబా గుర్రం జాడ తెలిపి అతనికి అనందం ,ఆత్మశాంతి కలిగించాడు .గుర్రాన్ని చూపడమంటే కోరినవారికి మార్గాన్ని చూపడమే .మనం పొగొట్టుకొన్నది తిరిగి పొందడం గురువు అనుగ్రహమే .

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

కెప్టెన్ వి.జి. హాటే , బికనేర్ గారి అనుభవాలు

కెప్టెన్ వి.జి. హాటే , బికనేర్ గారి అనుభవాలు

శ్రీ హాటే సాహెబ్ బాబాకు గొప్పభక్తుడు. ఆయన శిరిడీలో కొన్ని రోజులు ఉన్నారు. ఆయన గ్వాలియర్లో ఉన్నప్పుడు, ఆయన వద్దకు సాళూరాం అనే పేరు కలిగిన ఒక మరాఠా గృహస్థు కలవడానికి వచ్చాడు. “తన కుమారుడు ఇంట్లో నుండి తప్పిపోయాడని, అందువలన తనకు, తన భార్యకు చాలా దుఃఖం కలుగుతోందని” చెప్పాడు. శ్రీ హాటేకు బాబాపై పూర్ణశ్రద్ధాభక్తులు ఉండటం వలన, శ్రీహటే తనతో “నీవు శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకో! నీ కుమారుడు తప్పక దొరుకుతాడు” అని చెప్పాడు. అప్పుడు ఆ గృహస్థు వెంటనే “పిల్లవాడి కబురు అందగానే, వెంటనే శిరిడికి మీ దర్శనానికి వస్తాము” అని మొక్కుకున్నాడు. కొన్ని రోజులకు మెసపుటోనియా నుండి పిల్లవాడు వ్రాసిన ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో “నేను ఎవరికీ చెప్పకుండా యుద్ధంలో పాల్గొనడానికి వచ్చానని, ఇప్పుడు తిరిగి వస్తున్నానని” వ్రాసి ఉంది. ఈ వార్తను ఆ గృహస్థు శ్రీహాటేకు చెప్పగానే “అయితే మీరు వెంటనే బాబా దర్శనానికి వెళ్ళండి" అని శ్రీ హాటే చెప్పారు. కానీ ఆ గృహస్థు అలా చేయకుండా మొదట కుటుంబ సహితంగా , పిల్లావానిని కలవడానికి వెళ్ళాడు. కుమారుడు తిరిగి వచ్చాడు. కానీ ఆ అబ్బాయికి జ్వరం తరచుగా వస్తూ ఎంతో బలహీనుడయ్యాడు. కుమారుని ఆ పరిస్థితిలో చూసి సాళూరాం తనను తీసుకొని మరలా గ్వాలియర్ వచ్చాడు. శ్రీ హాటే వద్దకు మందుల కోసమై వెళ్ళాడు. అప్పుడు శ్రీహాటే తనతో “నీవు దారి తప్పావు, మొదట నీవు బాబా దర్శనం చేసుకోలేదు. నీ కుమారుని బాబా చరణాల వద్దకు తీసుకు వెళ్ళావంటే తప్పక స్వస్థుడవుతాడు” అని చెప్పాడు. వెంటనే శ్రీ సాళూరాం శిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. శ్రీహాటే వద్దనుండి పరిచయ ఉత్తరం అడిగాడు. అప్పుడు శ్రీహాటే “ఉత్తరం అవసరం లేదు, నేను ఒక వస్తువునిస్తాను. ఆ వస్తువుని బాబాకు సమర్పించు” అని చెప్పి పెట్టెలో నుండి ఒక రూపాయి నాణాన్ని తీసి సాళూరాంకు ఇచ్చాడు. బాబా చేతికి ఆ రూపాయినిచ్చి, మరలా ప్రసాదరూపంగా తీసుకోవాలనేది కెప్టెన్ హాటే గారి ఉద్దేశ్యం. కారణం అది చాలా దుర్లభమైన ప్రసాదం! సాళూరాం శిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనం చేసుకున్న తరువాత ఆ రూపాయిని బాబా చేతిలో పెట్టారు. బాబా ఆ రూపాయిని తిరిగిచ్చి “ఎవరిది వారికిచ్చేయ్” అని చెప్పారు. ఆ విధంగా బాబా, శ్రీ హాటే గారు మనసులో కోరుకున్నట్లుగానే ఆ రూపాయిని తిరిగి ఇచ్చేసారు. సాళూరాం తిరిగి గ్వాలియర్ కు వచ్చేసాడు. సాళూరాం హాటేను కలిసి “సాయి దర్శనం అయింది. పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు” అని ఆనందంగా చెపుతూ, బాబా “మీ రూపాయిని మీకు తిరిగి ఇచ్చేసారు” అని చెప్పాడు. దాంతో శ్రీ హాటే యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను వెంటనే లేచి బాబా ప్రసాదరూపమైన రూపాయిని చేతిలోకి తీసుకున్నాడు. కానీ వెంటనే బాబా హస్త స్పర్శ పొందిన రూపాయి అదికాదు అని తనకు స్పూర్తి కలిగింది. వెంటనే ఆ రూపాయిని తిరిగి ఇచ్చేసి, తీసుకువెళ్ళమని చెప్పారు. శ్రీ సాళూరాం మనసులో ఆశ్చర్యపోయాడు. ఆ రూపాయిని తిరిగి తీసుకు వెళ్ళాడు. మరలా మరుసటిరోజు వేరే రూపాయిని తీసుకువచ్చాడు. ఆ రూపాయి చేతిలో పడగానే శ్రీహాటేకు బాబా హస్తస్పర్శ అనుభవమైంది. “తన భార్య యొక్క పొరపాటు వలన రూపాయి మారిపోయింది” అని సాళూరాం చెప్పాడు.


సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

భక్తి అంటే ఏమిటి..మనం కోల్పోతున్నది ఏమిటి ?

అనన్య శరణ్యత్వం
విశ్వాసమే అసలైన భక్తి"

ఎత్తు అయిన రెండు భవనాల మధ్య ఒక తాడు
కట్టబడి ఉంది.
దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు.
వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా
అతను నడవ సాగాడు.
చేతిలో పొడవయిన కర్ర ఉంది...
బుజాన అతని కొడుకు ఉన్నాడు,
అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు....
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ
రెండో భవనం వైపు వచ్చాడు,
అందరూ చప్పట్లు కొట్టారు.
కేరింతలలో ఆహ్వానం పలికారు...
చేతులు కలిపారు ఫోటో లు తీసుకున్నారు,

నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను వెళ్లగలనా? అతను ప్రశ్నించాడు...
వెళ్లగలవు, వెళ్లగలవు జనం సమాదానం.
నా మీద నమ్మకం ఉందా?..
ఉంది, ఉంది. మేం పందానికి అయినా సిద్దం!

అయితే మీలొ ఎవరయినా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను!
అక్కడంతా నిశబ్దం..
జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు,
ఉలుకు లేదు, పలుకు లేదు,
నమ్మకం వేరు, విశ్వాసం వేరు.
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి.

ఈరోజుల్లో దైవభక్తి"లో మనం కోల్పోతున్నది ఇదే....
దేవుడు అంటే నమ్మకమే ... కానీ విశ్వాసం లేదు..
ఇదండీ..మన భక్తి..!!

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

త్రివిధ త్యాగాలు

ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో జ్ఞానేశ్వరీలో భగవానుడు చక్కని మార్గం చూపాడు

యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్


అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.

అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.

మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.

రెండవది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇద్ చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం సాయిదేవుని కైంకర్య రూపాలే అని నమ్మాలి.

మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి.

సరే! ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి? ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెపితే చాలు. ఏమిటండీ ఆ బంగారాల మాట? అదే సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు

పై త్రివిధ త్యాగలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి. అది సర్వేజనా స్సుఖినోభవంతు


నిరంతర శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హరం సర్వ దుఃఖ అవస్థ రక్షకరం

అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై

పాముకాటునుండి శ్యామాను కాపాడుట

ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు, జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింప బడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి, వానిని బంధములనుండి తప్పించగనే వానికి నిజము తెలియును. భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల జేసినప్పుడు వారిదృష్టి యన్నిటికంటె గొప్పస్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితముకంటె రానున్నది గొప్పదియని గ్రహింతురు.

గత అధ్యాయములో మిరీకర్ కు రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటె ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెనవ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ యెక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెద ననుకొనెను. స్నేహితు లాతని విఠోబాగుడికి తీసికొనిపోవ నిశ్చయించిరి. పాముకాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామా తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్ధీపితుడయి బాబా యిట్లునయె, “ఓరి పిరికి పురోహితుడా! యెక్కవద్దు, నీ వెక్కినచో నేమగునో చూడు” మని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను. “పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము.” బాబా యిట్లుకోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయ మందెను, నిరాశ చెందెను. అతడు మసీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను, శ్యామా దగ్గరకుపోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. “భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్యాస ముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు.” ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేలును, కాకాసాహెబు దీక్షితును అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసిన దేమన బాబా వలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కినవారివలె, వారేమంత్రము ఉపయోగింప నవసరము లేకుండెను. మంత్రబియ్యము గాని, తీర్థము గాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకలే మిక్కిలి బలమైనవి. ఎవరైన ఈ కథగాని యింక నితరకథలుగాని, వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహా సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార