బాకీ తీర్చిన భగవంతుడు


*బోధల బాబా:*..
బోధల బాబా అనే పంటకాపు పండరీపుర సమీపమున గల ధామణ అనే గ్రామములో తన భార్య మమతాబాయి మరియు కుమారుడు యమాజీతో కాపురము చేయుచుండెను.

బోధలబాబా దయార్ద్ర హృదయుడు. అతని భార్య, కుమారుడు కూడ అతని చేదోడువాదోడుగా ఉండెడివారు. వారందరు పండరీనాథుని పరమభక్తులు.
దీనులయందు, యాచకుల యందు దయార్ద హృదయులై ఎల్లప్పుడు వారి క్షేమమును కోరుటయేగాక ఆపదలో నున్నవారిని ఆదుకొనుట వారి దినచర్య.

ప్రతిపక్షము ఏకాదశికి పండరీపోయి ఆ రోజు ఉపవాసపు చేసి మరునాడు పంచభక్ష్య పరమాణములతో దీనులకు అతిధ్యమిచ్చి సంతోషించెడి వారు. బోధల బాబా పంటపొలముల దగ్గర కాపలాదారుగ పనిచేయుచు ఆ ఆసామి ఇచ్చేదానితో కుటుంబమును పోషించుకుంటూ అధితి అభాగ్యులను ఆదరించేడివారు.ఒకనాడు జొన్న చేనుకు కాపలా కాయుచుండగా పండరీపురము పోవు యాత్రికుల బోధల బాబాతో “అయ్యా! మేము మిక్కిలి ఆకలితో ఉన్నాము. మాకు కొన్ని కంకులను ఇవ్వ" మని అభ్యర్ధించ బోధల బాబా వారిలో పండరీనాధనే గాంచి “మీకు కావలసి నన్ని కంకులను తీసుకోండి" అనగావారు వారికి కావలసినన్ని కంకులను తీసుకొని వారి ఆకలి బాధను తీర్చుకొనిరి.

మరునాడే ఆ పొలము యొక్క భూస్వామి బోధల బాబాను పన్ను చెల్లించమనగా అతనిని మూడు రోజుల గడువు అడిగెను. ఆ భూస్వామి తన భటులను బోధల బాబా ఇంటి వద్ద ఉంచి అప్పు వసూలు చేసుకు రమ్మని ఆజ్ఞాపించెను.

ఆ మూడురోజులలో ఎన్ని ప్రయత్నములు చేసినను ఎక్కడ అప్పు పుట్టలేదు. ఏమీ చేయుటకు పాలుపోక పాండురంగని ప్రార్ధించగా ఆ దేవాదేవుడు తన ప్రియభక్తుని మొరనాలకించి వెంటనే గ్రామ తలాటి రూపమున భూస్వామి దగ్గరకు వెళ్ళి బోధల బాబా చెల్లించ వలసిన పన్నును చెల్లించి రశీదును తీసుకొని ఆ రశీదును బోధల బాబా ఇంటి దగ్గర ఉన్న భటులకు చూపించగా ఆ భటులు వెళ్ళి పోయిరి. ఇదంతయు పాండురంగని మహిమేనని గ్రహించిన భోదల బాబా "స్వామి! నా కోసం నీవు తలాటి రూపమెత్తితివా?" అని వాపోయి ఆయన కరుణకు ఆనంద బాష్పములు రాల్చెను.

*శివపురి సాయి మందిరము*..
కేశవరావు ప్రధాన్ మహారాష్ట్ర లోని కులాబా జిల్లాలోని భివపురిలో నివసించెడి వాడు. అతనికి కొద్దిగ పంట పొలము ఒక గృహము మాత్రము కలవు. కుటుంబ పోషణ సరిగ జరుగుటకు అతను ఒక ప్రవేటు కంపెనీలో బిల్ కలెక్టరుగ పని చేసెడివాడు.

బాబాను దర్శించక పూర్వము ప్రధానకు సాధువుల యందు నమ్మకముండెడిది కాదు. కాని అతని ఆప్తమిత్రునికి మాత్రము బాబాకు అనన్యభక్తుడు. ఒకరోజు అతను షిరిడీకి వెళ్ళుచు ప్రధాన్ ను కూడ తనతో రమ్మని ఆహ్వానించగా ప్రధాన్ నిరాకరించెను. అతను పదే పదే బలవంతము చేయగ రెండు షరతులతో ప్రధాన్ అంగీకరించెను.

అందులో మొదటిది బాబాకు నమస్కరించననియు రెండవది బాబా పాదతీర్ధము సేవించననియు తెలిపెను. అందుకు మిత్రుడు అంగీకరించగా ప్రధాన్ కూడ షిరిడీకి వేళ్లను.

వారు ద్వారకామాయికి వెళ్ళే సరికి ద్వారకామాయి అంతయు భక్తులతో కిక్కిరిసి ఉండెను. అదే అదనుగా భావించి ప్రధాన్ దూరముగ ఒకమూల కూర్చొనను. కొంత సమయము గడచిన తరువాత భక్తులు రద్దీతగ్గి ద్వారకామాయి ఖాళీ అయ్యాను. ప్రధాన్ వైపు చూస్తూ బాబా బిగ్గరగా "ఆ వెధవను నా వద్దకు తీసుకురండు. సాధువులంటే ఆగౌరవమా? వాడికి మంచి ఎదో, చేడు ఏదో చెప్పాలి" అని తిడుతూ అతని నైజమును వివరించెను.

బాబా మాటలు వినగానే ప్రధాన్ తన అభిప్రాయమును మార్చుకొనెను. బాబా తన అంతర్యామి అని తెలుసుకొనెను. బాబాపై నమ్మకము కుదిరెను. ఆ క్షణమునందే ప్రధాన్ బాబాకు అంకిత భక్తునిగా మారి బాబా చెంత వినయముగా నిలబడేను. ప్రధాన్ తన ఉద్యోగరీత్యా వసూలు చేసిన డబ్బునంతను తన చొక్కాకు గల రెండుజేబులలో భద్రపరచుకొనెను.

బాబా అది గ్రహించి అతని రెండు జేబులు ఖాళీ చేయించి వెంటనే షిరిడీ విడచి వెళ్ళమనెను. ప్రధాన్తో వచ్చిన మిత్రుడు కూడా బాబా ఆజ్ఞను పాటించి వెంటనే వెళ్ళిపొమ్మని చెప్పెను. ప్రధాన్ వద్ద నున్న డబ్బునంతా బాబా తీసుకొనుటచే అతని వద్ద చిల్లిగవ్వ కూడ లేకపోవుటచే ఆలోచనలో పడెను.

ప్రధాన్ వద్ద ఏమాత్రము డబ్బు లేకపోవుటచే ఏమిచేయుటకు పాలుపోక ముందుగా కోపర్గాం వరకు కాలినడకన బయలుదేరెను. అంతలోనే వెనుకవైపు నుండి ఒక జట్కాబండి వచ్చి అతని చెంత ఆగగానే అందులోకి ఎక్కి కూర్చోనెను.

కోపర్గగాం చేరిన తరువాత గాని అతనికి తన వద్ద డబ్బు లేదని గుర్తుకు వచ్చెను. ఏమి చేయవలెనా అని ఆలోచించగా అతని చేతి వేలికి గల బంగారు ఉంగరము గుర్తుకు వచ్చెను. వెంటనే దానిని తీసి టాంగా అతనికి ఇచ్చి దానిని బజారులో అమ్మి అతని బాడుగ పోను మిగిలిన సొమ్ము ఇవ్వమని చెప్పెను.

అంతలోనే అక్కడకు ఒక అపరిచిత వ్యక్తి ప్రత్యక్షమై టాంగా వానికి డబ్బులు ఇచ్చుటయే గాక ప్రధాన్ ప్రయాణించుటకు గాను రైలు టికెట్టును కూడ కొని అతనికి ఇచ్చను. ఇంతయు గాంచిన ప్రధాన్ అది కలయ? నిజమా? అని ఆలోచించు చుండగానే ఆ అపరిచిత వ్యక్తి మటుమాయమయ్యెను. అటు తరువాత ప్రధాన్ ఇంటికి చేరి తన యజమానికి వసూలు చేసిన సొమ్మును ఏ విధముగా చెల్లించ వలెనా అని ఆలోచిస్తూ తనకు ఆరోగ్యము సరిగా లేదనియు కొన్ని రోజులు శెలవు కావలెనని యజమానికి కబురు పంపి ఇంటి వద్దనే ఉండిపోయెను.

ప్రధాన్ పనిచేయుచున్న ఆఫీసు నుండి ఒక వ్యక్తి వచ్చి అతి పెద్ద మొత్తములో బాకీవసూలు చేసి ప్రధాన్ కార్యాలయములో జమ చేసినందులకు కృతజ్ఞతలు తెలుపుచూ ఒకవార్తను తెచ్చెను. ప్రధాన్ వద్ద బాబా స్వీకరించిన మొత్తముకన్నా ఎక్కువ తన పేరు మీద జమచేసింది బాబాయేనని ప్రధాన గ్రహించేను.

బాబా డబ్బు మనిషి కాదని ఈ భువిపై ధర్మమును నిలుపుటకే వచ్చిన భగవంతుడని తెలుసుకొని బాబాకు అంకితభక్తునిగా మారెను. ఈ భివపురి మందిరమే బాబా ప్రప్రథమ మందిరము.

Source :- మున్నలూరి బోస్
ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్.

 

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార