డబ్బులు మరియు కానుకలు కన్నా బాబాగారి ప్రేమను, పారమార్ధిక ఉన్నతినే కోరిన మహా భక్తుడు నానాసాహెబ్ నిమోన్కర్.

డబ్బులు మరియు కానుకలు కన్నా బాబాగారి ప్రేమను, పారమార్ధిక ఉన్నతినే కోరిన మహా భక్తుడు నానాసాహెబ్ నిమోన్కర్. ఇతను మేజిస్ట్రేట్. సాయి వద్ద వచ్చిన వారు ఎంత గొప్ప గొప్ప స్థితిలో వున్నవాళ్లో కదా ! కానీ సాయి చెంత ఉండడం చేత అన్నిటి కన్నా బాబా చరణాల వద్ద ఉంటే ఎంతో ఉన్నత స్థితి అని తెలుసుకున్న వాళ్ళు వారంతా.

నిమోన్కర్ అంటే శ్యామా తండ్రీ ఐన బల్వంతరావు దేష్పాండేకు అమితమైన ప్రేమ. వీరిరువురు బంధువులు కూడా.

చిత్రం ఏమిటంటే బల్వంతరావు ఎప్పుడు మసీదుకు వెళ్లిన తనపైన బాబాగారు ఇటుక రాయిని విసిరే వారు. దానితో అతను బాబాను పిచ్చి ఫకీరుగా తలిచాడు.

ఒకసారి అతను నిమోన్కర్ తో కలసి మసీదుకు వెళుతూ బాబా గారి పైన నిమోన్కర్ అభిప్రాయంను అంటే సాయి పిచ్చి ఫకీరొ కాదా అనేది చూసి చెప్పమన్నాడు బల్వంతరావు.

ఇద్దరు మసీదుకు వెళ్లగా బాబా ఆనాడు ఇటుక రాయిని విసరలేదు. నిమోన్కర్, బల్వంతరావు తో "నీవు బాబాను పిచ్చి వారిగా సందేహించుట వలన అలా చేసారని, నేను సందేహించలేదు కావున అలా చేయలేదని " నిమోన్కర్ చెప్పారు.

ఇప్పటి కూడా భక్తులు బాబాను ఏ విధంగా తలుస్తారో సాయి అదే విధానంగా చూపిస్తున్నారు. ఇది ఎందరి అనుభవంలో లెక్క లేనివి.

సాయికి నిమోన్కర్ పైన ఎంతో నమ్మకం ఉండేది. 1916-18 లో సాయి, అతనిని షరాబుగా (ఒక బ్యాంకర్ గా ) చూసేవారు. సాయిబాబా గారికి వచ్చిన డబ్బులను నిమోన్కర్ చేతికి ఇచ్చే వారు బాబా. అది చూసి చాలా మంది నిమోన్కర్ ను అపార్ధం చేసుకొనేవారు. చివరికి బాబా ముఖ్య భక్తుడు మాధవరావు కూడా. బాబాగారు, నిమోన్కర్ కు డబ్బులు దానం చేసేస్తున్నారని.

నిమోన్కర్ సాయిని నమిన్న భక్తుడు. ఎవరిని పట్టించుకోలేదు. అట్టి సహనం, ఎదుర్కొనే శక్తి, బాబా ను నమ్మినందుకు వచ్చాయని మరియు మాట పారేసుకోవడం, పౌరుషం, ఎవరేమి అన్నా తిరిగి జవాబు చెప్పక పోవడం కూడా సాయిని నమ్ముకోవడమే. దీనిని బట్టి బాబాను నమ్మిన వారికి దుర్గుణములు దూరం అవుతాయని సద్గుణములు చేరువవుతాయని అర్ధం అవుతుంది.

అలాంటి మాట వచ్చిన నిమోన్కర్ కు ఒకటే అనుకున్నాడట "ఫకీరు డబ్బు ఎవరి చెంత నిలువదు అనే బాబా చెప్పిన మాటలు తలచుకొనేవాడు, ఎవరైనా ఫకీరు డబ్బు తింటే చివరి పైసా వరకు కక్క వలసిందే అని అనుకున్నాడు తప్ప ఎవరిని ఎదిరించలేదు. మౌనం వహించాడు మరియు సాయి నే నమ్ముకున్నాడు. అందుకే అతను పారమార్థికంగా ఎంతో ఉన్నత స్థితి పొందాడు.

ఎలా ఉన్నత స్థితి కి చేరాడంటే సంస్కృతం అసలు రాని నిమోన్కర్ కు ఒక సారి బాబా అతనిని సంస్కృతం చదవమని ఆదేశించి నప్పటి నుండి అనర్గలంగా జ్ఞానేశ్వరి చదవగలే శక్తి వచ్చినది. సాయి ద్వారా పొందిన ఆధ్యాత్మిక శక్తితో ఇతరుల కష్టాలను నివారించే శక్తిని కూడా సంపాదించాడు.

బాబాను పిచ్చివాడని అనుకోక పోవడం అతనిని ఎంత ఉన్నత స్థితికి సాయి తీసుకొని వెళ్ళాడో కదా ! అలాగే డబ్బులు, కానుకల కన్నా శ్రేష్టమైన ఆధ్యాత్మికతను కోరుకోవడమే కదా అతని ఉన్నత స్థితి ని చేరుకున్నది.

కావుననే సాయి వున్నపుడు పైన చెప్పినట్లుగా ఎంతో మంది మేజిస్ట్రేట్, డాక్టర్, కలెక్టర్ ఇలా ఎంతో ఉన్నత స్థితి లో వున్నవారు సాయి కడకు వచ్చిన తరువాత అసలైన ఉన్నత స్థితి ఏమిటో తెలుసుకొని సుఖంగా వున్నారు.

మనం కూడా అలాంటి ఉన్నత స్థితి కోసం బాబాను వేడుకుందాము.

....... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్.

సాయి పాదములు ఒత్తుట

సాయిబాబా భక్తులలో కొద్దిమందికి మాత్రమే సన్నిహితంగా ఉండే అవకాశం దొరికేది. వారు సాయినాథుని పాదాలు ఒత్తేవారు. ఆ సమయం ఆ భక్తుల జీవితాలలో చిరస్మరణీయంగా, మధురాతి మధురంగా మిగిలిపోయేది. భక్తుల ఆలోచనలలో, పద్ధతులలో మార్పులు అప్పుడు జరిగేవి. సాయి చేసే భోధలకు యోగ్యమయిన స్థానం, సమయం అక్కరలేదు. కాని, పాదసేవనం చేసే సమయం కంటే ప్రశస్తమయిన బోధనాసమయం వుండదు. ఆ సమయంలో జరిగిన బోధలను హృదయంలో పదిలపరచుకుంటే పరమార్థం అరచేతిలోనే వుంటుంది.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

భక్తిని రెండు వివరణలు ఉన్నాయి.

మొదటిది మన నమ్మకం, మరియు రెండవది భగవత్ కృప.

ఉదా:::- కోతి పిల్ల తన తల్లి కడుపుని తన పూర్తి బలాన్ని అంతా ఉంచి పట్టుకుని ఉంటుంది, అందువలన తల్లి కోతి చెట్లు,కొండలు కోనలు ఎక్కిన పిల్ల కోతి పడిపోదు. కానీ ఇక్కడ కోతిపిల్ల నేను గట్టిగా పట్టుకున్నాను అనుకొదు తన తల్లి తనను జాగ్రత్తగా పడకుండా చూసుకుంటుంది అని అనుకుంటుంది......... ...

ఆపిల్ల కి ఉన్నది తల్లి మీద వున్న నమ్మకం. తల్లి బిడ్డను వదిలేస్తుందా....పిల్లను అంతకన్నా శక్తితో పిల్లను పట్టుకుంటుంది.

ఇది కూడా భక్తి భావం, దీనిలో భక్తుడు తన దేవుడిని పూర్తి నమ్మకంతో పట్టుకుంటాడో అనుక్షణం సాయిదేవుణ్ణి ఆర్ధిస్తాడో... సాయిభగవంతుడు కూడా అంతకన్నా గట్టిగా పట్టుకుంటారు.

రెండవ ఆలోచన ఏమిటంటే, పిల్లికి తన తల్లిని నోటితో పట్టుకోని తిరుగుతుంది. కాని ఆ పిల్లి పిల్లకి ఎలాంటి హాని కలగదు. పిల్లి అంత నమ్మకంతో తీసుకొని వెళుతుంది .పిల్ల కూడా అంతే నమ్మకంతో ఉంటుంది.

"శ్రీశిరిడీ సాయినాధుని సత్య స్వరూపం"..!!

సాయి ఎవరు ? అనే మౌలికమైన ప్రశ్నకు వివిధ సాయి భక్తుల నుండి విబ్భిన్నమైన సమాధానాలు వస్తాయి. సాయి అంటే శిరిడీలో 60 సంల పాటు నివసించి, యోగ విద్యలో పరిపూర్ణుడై ఎన్నో లీలలను చేసిన గురువు అని కొందరు, శిరిడీ మందిరం లో ప్రతిష్టించిన విగ్రహం రూపంలో వున్న దేవుడని కొందరు, జీవితమంతా భిక్షాటన తో జీవించిన ఒక ముస్లిం ఫకీరు అని మరికొందరు భావిస్తుంటారు. యద్భావం – తద్భవతి ! భావం బట్టే మనకు లభించే గురువు అనుగ్రహం ఆధారపడి వుంటుంది. సాయి పట్ల మన భావం అల్పమైతే మనపై వర్షించే సాయి అనుగ్రహం కూడా అల్పంగానే వుంటుంది. సాయి అనుగ్రహం మనపై పుష్కలంగా వర్షించాలంటే సాయిపై మన భావం కూడా ఉన్నతంగానే వుండాలి. అందుకు సాయి ఎవరు? ఆయన బోధలు, తత్వం ఏమిటి అన్న విషయాలను అవగతం చేసుకుంటే తప్ప ఉన్నతమైన, శ్రేష్తమైన భావాలు మనకు కలగవు.

అందుకే తనను గూర్చి శ్రీసాయి ఏమన్నారో ఒకసారి శ్రవణం చేద్దాం: అన్ని ప్రాణుల హృదయాలలో వుండే నేనే నిజమైన నేను అని ఒక సంధర్భంలో, నేనే బ్రహ్మమును, నేను నిత్య శుద్ధ బద్ధ ముక్తుడను, నేనే ఓంకారమును, అందరి హృదయాలలో అందరి కంటే సమీపంగా నివసించుచుందును.నన్ను శ్రద్ధాభక్తులతో పూజించిన ఎడల శ్రేయస్సు పొందుతారు అని పలికారు. ఇంకొక సందర్భం లో నేను మీకు అన్నింటి కంటే ఎంతో సమీపస్థుడను, సర్వ అంతర్యామిని, అందరికీ ప్రభువును నేను. ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపమే ! పిపీలికాది పర్యంతం జడమైన పర్వతముల వరకు అన్నియూ నా వ్యక్త స్వరూపములే. ఈ విశ్వమంతా నా ఆత్మ స్వరూపమే. నా రాకపోకలకు తలుపులతో నిమిత్తం లేదు. నేను ఏ ఆధారం లేక ఈ జగత్తు అంతటా ప్రయాణం చేయగలను. నేను నామ, రూప, గుణ రహితుడను. సర్వత్రా నిండి వున్న నేను మూర్తీభవించిన జ్ఞానం, చైతన్యం, ఆనంద రూపమని అవగతం చేసుకొనండి. నా నిజ స్వరూపమును తెలుసుకొని సదా నన్నే ధ్యానించు అని అపూర్వంగా పలికారు శ్రీ శిరిడీ సాయినాధులు.

దీనిని బట్టి శ్రీ సాయి పరిశుద్ధ పరమేశ్వర అవతారం అని మనకు స్పష్టంగా అవగత మౌతోంది. ఇప్పుడు శ్రీ శిరిడీ సాయినాధుల సత్య స్వరూపం గూర్చి శ్రవణం చేద్దాం. ప్రకాశైక స్వరూపుడు, జననమరణ చక్ర భ్రమణములకు అతీతుడు, నిత్య ప్రకాశకుడు, పరమ పవిత్రుడు, విశుద్ధ విజ్ఞాన ఘనరూపుడు, నిరాకారుడు, నిర్గుణుడు, త్రిగుణాతీతుడు, పరిపూర్ణుడు, ఆనంద స్వరూపుడు, క్రియారహితుడు, నిరాకార పరబ్రహ్మం, మాయాతీతుడు, స్వప్రకాశకుడు, కాలాతీతుడు, సర్వ వ్యాపకుడు, అనంత విశ్వమంతా వ్యాపించి వున్న సత్య జ్ఞాన సాగరుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, నిర్మలుడు, వాగాతీతుడు, అమృత స్వరూపుడు, శాశ్వత ఆత్మ స్వరూపుడు”.

ఆయనే స్వయంగా ఒక సందర్భంలో ఒక భక్తునితో నేను పుట్టినప్పుడు కొడుకు పుట్టానని మా అమ్మ ఎంతో పొంగిపోయింది. ఆది చూసి ఆమె నన్ను కన్నది ఎప్పుడు ? ఆమె కన్న ముందు నేను లేనా ? అందుకు ఆమె ఎందుకంత ఆనంద పడుతోందో నాకు అర్ధం కాలేదు అని ఆశ్చర్యపోయాను అని అన్నారు. దీనిని బట్టి శ్రీ శిరిడీ సాయినాధులు అయోనిజ సంభవులని, జనన మరణములకు అతీతమైన ఆత్మ స్వరూపమని అర్ధమౌతోంది కదా ! అందుకే శ్రీ సాయి వివిధ భక్తులకు వారు కోరిన రూపాలలో దర్సనం ఇచ్చి ఎన్నో సందర్భలలో తన సర్వజ్ఞతను చాటారు.

ఈ కలియుగంలో 19 వ శతాబ్దంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కోసం సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే ఒక మానవ దేహం దాల్చి దివి నుండి భువికి దిగి వచ్చింది.
సాయి భక్తుల్లారా ! అర్ధమయ్యిందా మన సాయి నిజ సత్య స్వరూపం ఏమిటో ? ఎన్నో లక్షల సం లలో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మలో సాయి భక్తులం కాలేము అన్నది నిర్వి వాదాంశం. ఆ భాగ్యం మనకు లభించింది. కనుక మన సద్గురువు పట్ల మనకు గల సంకుచిత భావాలను వదిలించుకొని అత్యున్నతమైన భావం పెంపొందించుకొని, సదా ఆయననే ఆరాధించుదాం. ఈ కలి కల్మషంలో పాప కార్యములను చేయక, అపారమైన పుణ్యం సాధించుకొని మోక్షం కొరకు కృషి చేద్దాం. శ్రీ సాయినాధులను ఈ విధమైన ఉన్నత భావాలతో ఉపాసన చేస్తే అతి శ్రీఘ్రముగా సాయి కృపకు పాత్రులమై అతి దుర్లభమైన పరమ శాంతిని పొందగలం.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార

"సాయినామ జప మహిమ"..!!

1982 వ. సంవత్సరంలో, గుంటూరులోని సాయిభక్తులు షిరిడీలో సాయినామ సప్తాహాన్ని పూర్తి చేసిన తరువాత 11.12.1982 లో గుంటూరులోని ఆర్. అగ్రహారం లోని సాయిమందిరంలో సాయి అఖండనామ సప్తాహాన్ని నిర్వహించారు. ఆ సాయి నామసప్తాహంలో పాల్గొన్న భక్తులందరి మీద వారిలో ఉన్న శ్రధ్ధాభక్తులను బట్టి సాయిబాబా తమ దయను, అనుగ్రహాన్ని కురిపించారు.అటువంటి రెండుసంఘటనలను యిప్పుడు వివరిస్తాను.

గుంటూరులో సాయిభక్తురాలయిన శ్రీమతి వరలక్ష్మమ్మగారు క్రమం తప్పకుండా సప్తాహంలో పాల్గొంటు ఉండేవారు.అఖండనామ సంకీర్తన జరుగుతూ ఉంది కాబట్టి బాబా స్వయంగా తన నామసంకీర్తనకు తప్పకుండా వచ్చే ఉంటారని భావిస్తూ ఉండేది ఆమె. ఆమెకు బాబామీద అంత గట్టి నమ్మకం. ఎక్కడయితే నా నామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ తానుంటాననే విషయాన్ని శ్రీమహావిష్ణు మూర్తి నారదమహామునికి చెప్పిన విషయం ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. మన సాయి నారాయణులవారు కూడా ఎక్కడయితే తన నామజపం జరుగుతూ ఉంటుందో అక్కడ తానుంటాననే విషయాన్ని ఋజువు చేశారు.

ఒకరోజు విరాళాలు యిచ్చిన వారి పేరుమీద పూజ జరిగింది. సప్తాహంలో సమర్పించిన ప్రసాదం నాలుగు పొట్లాలు ఆమెకు యివ్వడం జరిగింది. బాబా ఆమె ముందు ప్రత్యక్షమయి తనవంతు ప్రసాద భాగాన్ని యిమ్మని అడిగారు. ఆమె వెంటనే తన ప్లాస్టిక్ బ్యాగులో వేసుకున్న నాలుగు పొట్లాలలోనుండి ఒక పొట్లం తీసి ఆయనకు యిచ్చారు. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అకస్మాత్తుగా సాయి అదృశ్యమయ్యారు. ఆ తరువాత ఆమె తన బ్యాగులో ఉన్న పాకెట్లను లెక్కచూస్తే మూడే వున్నాయి.

ఆవిడ వెంటనే మాతృశ్రీ పూలమ్మగారి వద్దకు వెళ్ళింది. ఈ పూలమ్మగారు ఆంధ్రదేశ మంతటా సాయిప్రచారాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చిన సాయిసేవిక.ఆవిడ పూలమ్మ గారికి జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది. పూలమ్మగారి అసలు పేరు చుండూరు కామేశ్వరమ్మ.ఆమె సాయిపూజ చేస్తున్నప్పుడెల్లా ఆమె చేతిలోని పూలు రెట్టింపు అవుతూ ఉండేవి. అందువల్లనే భక్తులందరూ ఆమెను ప్రేమతో పూలమ్మ అని పిలుస్తూ వుండేవారు. ఆమె తన స్వగ్రామమయిన నందూరులో సుందర మయిన సాయిమందిరాన్ని నిర్మించింది. నీ ఆలోచనలకు భావాలకు అనుగుణంగానే బాబా నీకు దర్శనమిచ్చారని పూలమ్మగారు వరలక్ష్మమ్మతో చెప్పారు.

మరొక భక్తురాలయిన శ్రీమతి కన్న రంగనాయకమ్మ శ్రీసాయినిలయ, శ్రీనివాసరావు తోట, గుంటూరులో ఉన్న వారి యింటిలో గోడకు తగిలించి వున్న బాబా ఫొటోలో నీటి బిందువులు కనిపించాయి. మరునాడు మాలో కొంతమందిమి ఆమె యింటికి వెళ్ళి చూశాము. బాబా ఫొటోకు, పైన ఉండే గాజు పలకకు మధ్య నీటి బిందువులు కనిపించాయి. దానికి కారణమేమిటని నేను అడిగాను. అపుడామె "ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి" అనే నామసప్తాహానికి బాబా సంతోషించి కార్చిన ఆనందభాష్పాలని వివరించారు.