కుక్క ముట్టిన పెరుగు

ఒక వ్యక్తి కొన్నిమాసాలపాటు ఉండటానికని శిరిడీ వచ్చాడు. రహస్యంగానైనా సాయిమహరాజ్ ఫోటో ఒకటి తీయాలని అతని కోరిక. ఒకసారి బాబా లెండీకి వెడుతూ సాఠేసాహెబ్ వాడా దగ్గర నిలుచునివున్నారు. ఆ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా బాబాను ఫోటో తీసాడు. 'నెగెటివ్' కడిగిచూస్తే బాబాకు దగ్గరగా నిలబడి ఉన్న వ్యక్తులందరూ ఫోటోలో పూర్తిగావచ్చారు కానీ, బాబా ఉండాల్సినస్థానంలో బాబా పాదాలు మాత్రమే కన్పించాయి! భక్తులు తమ గురుపాదాల మీదనే తమ దృష్టి నిలపాలని వేదాలలో చెప్పినదానిని ధృవపరుస్తుంది - యీ చక్కటి దృష్టాంతం. దేహమంతా పాదాలను ఆధారం చేసుకొని నిలుస్తుంది. అంటే పాదాలు మొత్తం శరీరానికి ఆధారం, ప్రతీక అన్నమాట. మామూలుగా మన అలవాటు ప్రకారం శరీరాన్ని చూడటం కాక, గురుపాదాలమీదనే మన దృష్టిని నిలపాలి. నీళ్ళలో నిలబడి చేపలు పడుతున్న జాలరి కాళ్ళ దగ్గరవున్న చేపలు ఎట్లాగైతే వలలో చిక్కుకోవో, అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించినవారు 'మాయ' యొక్క వలలో చిక్కుపడరు.

కుక్క ముట్టిన పెరుగు

ఒకనాడు బాబా భోజనం చేస్తుండగా, ఒక కుక్క మసీదులోకి దూరి, పెరుగు గిన్నెలో మూతి పెట్టింది. ఫకీరుబాబా (బడేబాబా) అది చూచి ఆ ప్రక్కనేవున్న ఒక కుర్రవాడితో “దాన్ని బయటకు తరుము” అన్నాడు. ఆ కుర్రవాడు ఆ కుక్కను తరమడానికి లేచాడు. ఇంతలో, “ఏమిటి సంగతి?” అని అడిగారు సాయి. ఫకీరుబాబా విషయం చెప్పాడు. అప్పుడు బాబా అతనితో “అరే బాపూ (ఫకీరుబాబా) ఆ పెరుగు చాలా బాగుంది. ఆ పెరుగును ఇంటికి తీసుకొనిపోయి, దానితో కఢీ (పెరుగు, మసాలా కలిపి చేసే ఒక రకమైన వంటకం.) తయారుచేసి మధ్యాహ్నం భోజనానికి పట్టుకురా! - నేను తింటాను” అన్నారు. అలానే, ఫకీరుబాబా ఆపెరుగును తీసుకొనిపోయి కఢీ వండి తీసుకువచ్చాడు. బాబా ఏవిధమైన ఏహ్యభావంలేకుండా ఆరగించారు.

బాబా సోదరి!

బాబా కిర్వండికర్ అనే బ్రాహ్మణుడు శిరిడీలో ఉండేవాడు. ఆయన కూతురు శాంత మూడేళ్ళది. సాఠెవాడా వెనుక ఒక బావి వుంది. ఆ పాప ఒకరోజు ఆనూతిలో పడిపోయింది. బయటవాళ్ళుచూచ బయటకు తీసేసరికి చాలా సమయం పట్టింది. అంతవరకూ ఆపాప నూతిలోనేవుంది. ఆశ్చర్యమేమిటంటే ఆ అమ్మాయి ఒంటిమీద ఒక్కగాయం గూడా లేదు! అసలేం జరిగిందో చెబుతూ ఆ అమ్మాయి, “నేను పడిపోతుంటే బాబా నన్ను పట్టుకొని, ఒక ప్రక్కన కూర్చోబెట్టారు” అని అన్నది. ఆ పాప తాను బాబా సోదరినని చెబుతూ ఉండేది! బాబాకు కూడా ఆపాప అంటే ఎంతో మక్కువ.

అంతర్యామి మందలింపు

ఒకసారి నా మిత్రుడు ఒకాయన బాబా దర్శనం కోసం శిరిడీ వచ్చాడు. బాబా దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టసాగాడు. ఉన్నట్టుండి బాబా, “కాళ్ళు పట్టవద్దు! వెళిక్కడనుంచి” అని గద్దించారు. ఆ మిత్రుడు ప్రక్కకు వెళ్ళి, కొంతసేపు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత మళ్ళీ బాబా దగ్గరకొచ్చి, ఆయన కాళ్ళుపట్టడం ప్రారంభించాడు. బాబా ఈసారి అతణ్ణి అభ్యంతరపెట్టలేదు. అందరము బసకు చేరుకున్న తరువాత అసలేం జరిగిందో ఆ మిత్రుడు మాకు వివరించాడు. మొదటిసారి బాబా కాళ్ళుపడుతుండగా అతనికొక అపవిత్రమైన ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచన మనస్సు లోకి వచ్చినవెంటనే బాబా అతణ్ణి తన కాళ్ళుపట్టడం ఆపమన్నారు. ఆ మిత్రుడు తర్వాత పశ్చాత్తాపపడి, తనను క్షమించమని బాబాను మనస్సులో ప్రార్థించి, తిరిగి బాబా పాదాలు పడితే బాబా అభ్యంతరం చెప్పలేదు. భక్తులకు ఇటువంటి అనుభవాలు ప్రతిరోజూ ఎన్నో జరుగుతూనే ఉంటాయి. బాబా యొక్క బోధనా పద్ధతి అనిర్వచనీయం.

బాబానే చూచుకొంటారు!

మమల్తదారుగా పనిచేస్తున్న శంకర్రావు క్షీరసాగర్ సాయి దర్శనం కోసం శిరిడీ వచ్చాడు. శ్రీసాయి అతణ్ణి దక్షిణ అడిగినప్పుడు, తన దగ్గరున్న పైకమంతా తీసి సాయికి సమర్పించాడు. అతను బసకు తిరిగిరాగానే ఎవరో అడిగారు. “మరి నీ తిరుగు ప్రయాణం ఖర్చులకు ఏం చేస్తావని”. “బాబానే ఇస్తారులే!” అని శంకర్రావు జవాబిచ్చాడు. అదేరోజు సాయంత్రం రహతా పోస్టుమాస్టరు తన అతిథిగా వచ్చిన ఒక మిత్రునికి తోడుగా శిరిడీ వచ్చాడు. కొన్నేళ్ళక్రితం ఆ అతిథిగా వచ్చిన వ్యక్తికి శంకర్రావు ఇరవై రూపాయలు చేబదులుగా యిచ్చాడట. శంకర్రావు ఏమీ అడక్కముందే ఆ వ్యక్తి తాను తీసుకొన్న పైకాన్ని శంకర్రావుకు తిరిగి చెల్లించాడు. శంకర్రావు ఖర్చులన్నింటికీ ఆ పైకం చక్కగా సరిపోయింది!

ఎవ్వరినీ పొగడవద్దు!
ఎవ్వరినీ తెగడవద్దు!

ఒకసారి ఓ ఇద్దరు మిత్రులు వాడా(దీక్షిత్ వాడా)లో కూర్చుని ఏసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమాటలు క్రైస్తవ మతంలోని లోపాల్ని వెతికే ధోరణిలో పడింది. నేనప్పుడక్కడే ఉన్నాను. నేను కూడా వారితో కలిసి క్రైస్తవాన్ని విమర్శిస్తూ మాట్లాడాను. కొంతసేపయిన తరువాత బాబా దర్శనం కోసం వెళ్ళాను. వెళ్ళడంతోటే బాబా పాదాలకు నమస్కరించబోయాను. బాబా తమ పాదాలు చివుక్కున వెనక్కిలాక్కున్నారు. సాయి ప్రతినిత్యం తరచూ చెప్పే సలహాకు వ్యతిరేకంగా ప్రవర్తించానని ఆ చర్యతో వెంటనే నాకర్థమయింది. నా తప్పును క్షమించమని, మనస్సులోనే సాయిని ప్రార్థించాను. వెంటనే, తనంతటతానే, సాయి ముడిచిన తన కాళ్ళను జాపుతూ, “రా! కాకా! వచ్చి కూర్చో! ఎవ్వరినీ పొగడవద్దు! ఎవ్వరినీ తెగడొద్దు!” అన్నారు మరాఠీలో. ఇతరుల గురించి మంచిగా మాట్లాడేవారు చాలా తక్కువ. ఎక్కువమంది ఇతరుల గురించి చెడుగానే మాట్లాడుతారు. అందుకని ఎవ్వరినీ దూషించవద్దు. శ్రీసాయి ఎప్పుడూ మన చర్యలను జాగరూకతతో గమనిస్తూ హెచ్చరిస్తూ వుంటారు.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార