ఆపదలో ఆదుకునేవాడే భగవంతుడు

భక్తుడు బాధలో ఉంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు గదా! ఆ ఆపదల నుండి
రక్షించుటయే భగవంతుని కర్తవ్యం.

*భక్త నరసీ మెహతా*..
బంగారాన్ని పుటం వేస్తే కానీ మెరవదు. అలాగే బాధలను అనుభవిస్తే గాని భక్తునికి భగవద్దర్శనం కాదు. నరసీ మెహతా తల్లిదండ్రులు అతని చిన్నతనముననే కాలము చేసిరి. అతని అన్నలే నరసీ మెహతాను పెంచిరి. నరసీ కుటుంబ బాధ్యతలను పట్టించుకొనక అల్లరి చిల్లరిగా తిరిగేడివాడు. అది చూచి అతని వదినలు వారి భర్తలతో చెప్పి నరసీ మెహతా కుటుంబాన్ని బయటకు గెంటివేసిరి.

నరసీ మెహతాకు వివాహమై ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె జన్మించిరి. కుమార్తె పేరు కువరీబాయి, నరసీ మాత్రము ఎల్లవేళలా భగవన్నామ సంకీర్తన చేయుచు కాలం గడిపెడివాడు. అతని కుమార్తెకు 7సంవత్సర ప్రాయములోనే వివాహము చేసి అత్త వారంటికి పంపిరి. కొన్ని సంవత్సరముల తర్వాత ఆమె పుష్పవతి అయ్యేను.

అటువంటి సమయంలో పిల్ల తల్లిదండ్రులు సారె తీసుకువెళ్లి వియ్యంకులకు సమర్పించి వేడుక జరిపించవలెను. అదే విషయం నరసీ భార్య, నరసీతో చెప్పగా అతడు *నాకున్నది భగవన్నామ సంకీర్తనం. అదియే కుమార్తెకు కానుకగా ఇచ్చెదను* అని చెప్పి ఒకచేతితో తాళములు రెండవచేతితో తంబురను,పట్టుకొని భగవన్నామ సంకీర్తన చేయుచు వియ్యంకుల వారి ఇంటికి వెళ్లి “మీకు ఏమి సారే కావలెనో ఒక చీటి వ్రాసి ఇవ్వండి భగవంతుని కృపాకటాక్షములచే వాటినన్నింటినీ మీకు సమర్పించెదను" అని చెప్పగా,

వియ్యంకులవారి ఇంటినుండి వారందరు వారి వారికి కావలసిన వస్తువులను అన్నిటిని ఒక లేఖకునిచే వ్రాయించగా ఆ లేఖకుడు తనకు ఒక గుండు రాయి కావలెనని రాసాను. ఆ పత్రమును తీసుకుని మెహతా సరాసరి పాండురంగ ఆలయం లోనికి వెళ్ళి తన ఆవేదనను రంగనికి విన్నవించుకొనెను.

ఆ విధముగా తన అసమర్ధతకు చింతిస్తూ సోమ్మసిల్లి పడిపోయెను. భక్తుని బాధలు భగవంతునివే గదా! వెంటనే పాండురంగడు ఒక నౌకరు వేషధారియై ఆ చీటీలో ఉన్న వస్తువులన్నిటిని కొని ఒక బండిలో వేసుకొని నరసీ వియ్యంకులు గృహమున కేగి *నేను నరసీ మెహతా నౌకరును మీరు కోరిన వస్తువులన్నిటిని నా యజమాని పంపినాడు. మీరు అన్ని వచ్చినవో లేదో సరి చూసుకోండి* అని చెప్పి అక్కడ ఆ ఇంటి అరుగుపై కూర్చుండెను.

వారి వ్రాసినవన్ని గుండు రాయితో సహా ఉండుటచే సంతృప్తిచెంది *ఓయీ! నీ యజమాని ఎక్కడ*? అని ప్రశించగా అతను పాండురంగని ఆలయంలో ఉన్నాడు అని చెప్పగా అందరు ఆలయానికి వెళ్లి చూడగా నరసీ మూర్చిపడి ఉండుట గాంచి అతనికి ఉపచారములు చేయగా నరసీ మూర్చ నుండి తేరుకొని *బావగారు! నన్ను క్షమించండి. నాకు కొంత గడువు ఇవ్వండి. మీరు కోరినవన్నీ సమర్పించుకుంటాను* అనగా అది విన్న వారందరు విస్తుపోయిరి. జరిగినదంతా నరసీకి చెప్పగా నరసీ అదంతయు రంగని మహిమ తనకోసం పాండురంగడు నౌకరు వేషధారియై తన వియ్యంకుల కోర్కెను తీర్చెనని గ్రహించి అతని హృదయాంతరాళములు భక్తితో పొంగి పొర్లినది.

*నానాసాహెబ్ చందోర్కర్*..
అది నానాసాహెబ్ జామ్మేరులో పని చేయుచున్న రోజులు. అతని కుమార్తె మైన తాయి గర్భిణి కాగా ప్రసవదినములు దగ్గరపడెను. ఆమె ఆరోగ్యపరిస్థితి బాగుండ లేదు. ప్రసవవేదన పడసాగెను. అటువంటి సమయంలో ఊది బాగా పని చేస్తుందని వారికి తెలుసు.

కానీ ఆ సమయానికి ఇంటిలో ఊది నిండుకున్నది. ఏమీ చేయుటకు వారికీ దిక్కు తోచలేదు. నానాసాహెబ్ వెంటనే పూజా గదిలోనికి వెళ్ళి *బాబా! నీట ముంచిన, పాల ముంచినా భారము నీదే. నాకుమార్తెకు సుఖ ప్రసవము కావించి ఆమెను ఆరోగ్యవంతురాలిని చేయుట నీదే బాధ్యత* అని భారమంతయు బాబాపై వేసెను.

ఆ సమయానికి షిరిడీలో రామ్ గీర్ బువా ఉన్నాడు. అతనిని బాబా 'బాపూగీర్ బువా' అని పిలచెడివాడు. అతను తన స్వగ్రామమైన ఖాందేషు వేళ్ళుటకు అనుమతిని వేడగా బాబా అతనికి కొంత ఊదిని మరియు ఆరతి పాటను ఇచ్చి *వీటిని జామ్నేరులో ఉన్న నానాసాహెబ్ కు ఇవ్వు* అని ఆజ్ఞాపించెను. రామ్ గీర్ బువా ఆలోచనలోపడెను.

అతని వద్ద ఉన్న డబ్బులు జలగామ్ వరకు వెళ్ళుటకు మాత్రమే ఉన్నది. అక్కడ నుండి జామ్నేరు కనీసం 30 మైళ్ళు ఉంటుంది. ఎట్లా వెళ్ళాలా అని ఆలోచించి *వెళ్ళమన్నది బాబా నా భారమంతా బాబాదే*. నన్ను అక్కడకు చేర్చే బాధ్యత బాబాదే అని మనస్సులోనే నిశ్చయించుకొని అతని వద్ద నున్న డబ్బులతో రైలు ఎక్కి జలగామ్ చేరెను.

అక్కడ నుండి జామ్నేరు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుండగా ఒకతను షిరిడీనుండి వచ్చిన బాపూగీర్ బువా ఎవరు?" అని ప్రశ్నించగా బాపూగీర్ అతని, చెంతకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకొనగా అతను తనను నానాసాహెబ్ పంపెనని చెప్పి గుఱ్ఱపుబండిలో కూర్చుండ బెట్టి దారిలో ఆహారం పెట్టి జామ్నేరు చేరి నానాసాహెబ్ గృహమునకు తీసికొనిపోయెను.

బాపూగీర్ గృహములోనికి పోయి నానాసాహెబ్ తో తాను షిరిడీ నుండి వస్తున్నట్లు చెప్పి బాబా ఇచ్చిన ఊదీ, ఆరతి పాటను ఇవ్వగా వారు సకాలంలో ఊది వచ్చి నందుకు సంతసించి కొంత ఊదీని మైనతాయి నుదుటన పెట్టి మరికొంత నీటిలో కలిపి ఆమెచే త్రాగించి ఆరతిని పాడగా వెంటనే మైనతాయికీ సుఖప్రసవం జరిగెను. ఆ వెనువెంటనే నానాసాహెబ్ బయటకు వచ్చి బాపూగీర్ బువాకు కృతజ్ఞతలు చెప్పగా అతను *

మీరు స్టేషనుకు జట్కాబండి పంపకపోతే నేను సకాలంలో ఇక్కడకు వచ్చే వాడిని కాను* అని చెప్పగా సానాసాహెబ్ మీరు వస్తున్న సంగతి నాకు తెలియదు.

నేను ఏ బండి మీకోసం పంపలేదు అని చెప్పగా బాపూగీర్ అచ్చెరెవొంది ఇరువురు బయటకు వచ్చి చూడగా అక్కడ జట్కాలేదు జట్కావాడు లేరు. ఇదంతా బాబా లీల అని ఇరువురు గ్రహించారు. తనను బాబా ఒక్కరే *బాపూగీర్* అని పిలుస్తారు అని రామగీర్ బువాకు గుర్తుకు వచ్చేను.

*భక్తి కోసం భగవంతుడు ఎంతటి శ్రమకైనా వెనుకాడడు. భక్త రక్షణయే భగవంతుడు.*

Source :- మున్నలూరి బోస్, ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్.

*ఎవరు సొమ్ము వారికే

పాండురంగని అగ్రగణ్యుడు భక్తులలో ఏకనాథుడు ఒకడు.జ్ఞానదేవ్ భగవద్గీతను మరాఠీలోకి అనువదించినట్లే ఏకనాథుడు భాగవతాన్ని మరాఠీ భాషలోకి అనువదించి నాలుగు స్కందాలు పూర్తి అయిన తరువాత కాశీలోని పండితుల ఆమోదానికై తన శిష్యునిచే పంపగా ఆ శిష్యుడు మణికర్ణికా ఘాట్ వద్ద ఏకనాథుడు రాసిన భాగవతాన్ని పారాయణ చేస్తూంటే అసంఖ్యాక భక్తులు వారికి మరాఠీ భాష రాక పోయినను ఆ భాషా మాధుర్యాన్ని ముగ్గులయ్యే వారు.

ఆ సంఘటనను చూసిన ఒక మహంతు శిష్యుడొకడు తన గురువుతో చెప్పగా అతను దేవభాషలో నున్న భాగవతాన్ని ప్రాకృత భాషయైన మరాఠీలోని అనువదించిన ఏకనాధుని తన వద్దకు పిలుపించుకొన్నాడు. కాశీలోని ప్రజలందరు ఏకనాథుడు తేజోవంతమైన ముఖవర్చసుకు అచ్చెరువొందిరి. ఏకనాథుడు సంస్కృత భాషకు ద్రోహం చేశాడన్న నెపంతో అతనిని రాజు వద్దకు తీర్పుకు తీసుకు వెళ్ళారు. ఆ రాజు ఒక మూర్ఖుడు. మహంతి ఆలోచనలకు అనుగుణంగా తీర్పు నిస్తూ ఏకనాథ విరచితమైన భాగవతము గంగా నదిలో పడవేయించెను. ఏకనాథుడు ముకిళిత హస్తుడై గంగాదేవిని ప్రార్ధించి అక్కడ ఆశీనుడయ్యెను. అందరూ చూచుచుండగనే ఏకనాథుని భాగవతము నీటిపై తేలియాడుతూ ఏకనాధుని చెంతకు చేరును. వెంటనే గంగామాత *"ఏకనాధా! నీవు రచించిన ఈ పవిత్ర గ్రంథ రాజము నాలో మునకలు వేసి నన్ను మరింత పరమపావన మొనర్చెను. నేడు నీవలన నాజన్మ ధన్యమైంది. ఇదిగో నీవు వ్రాసిన భాగవతము తీసుకో, ఇది బహుళ ప్రాచుర్యము పొందును. అసంఖ్యాకులను ఉద్ధరించును*" అని భాగవతాన్ని ఏకనాధునికి సమర్పించేను.
గంగమాత ఎవరి వద్ద నుంచి ఉచితంగా ఏది గ్రహించదు. ఏకనాథుని సొత్తుని
ఏకనాథునికే సమర్పించినది.

*చేజారినది చేజిక్కిన వేళ*..!!
ఏదైనా వస్తువు మన చేజారి తిరిగి కొన్నాళ్ల తరువాత మన చేజిక్కితే ఆ సంతోషమే వేరు. అందులోనూ గంగలో చేజారిన వైతే ఆ సంతోషమే, సంతోషం.హరి బావు కేశవ్ అనే అతను హరిభావు కే. కార్నిక్ అనే అతని మనమడు.ఇరువురు సాయి భక్తులు. సాయి యందు పూర్తి విశ్వాసం గలవారు. ఒక పర్యాయము వారి
గ్రామమునకు 10 మైళ్ళ దూరంలో గల ఒక నది ఒడ్డున గల దేవాలయములో సంబరములు జరుగుచుండగా కేశవ్ అక్కడకి వెళ్ళను. ప్రతి నిత్యము నదిలో స్నానం చేయడం ఈతకొట్టుటయే గాక దైవ దర్శనం కూడ చేసుకొనేవాడు. అతను తిరుగు ప్రయాణమయ్యే రోజు కూడా నదిలో ఈత కొట్టుచుండగా అతని చేతి వ్రేలికి ఉన్న ఉంగరము నదిలో జారిపోయెను, నదిలో పడిపోయినది దొరకుట కల్ల అని మనకందరకు తెలుసు. ఆపరిస్థితుల్లో కూడా తాత మనవడు ఇద్దరు కూడా బాబా పై భారము వేసి బాబాను వేడుకొనిరి.

సుమారు ఆరు మాసాల తర్వాత ఒక రోజు ఒక ఫకీరు వేషధారి కేశవ్ ఇంటికి వచ్చి
*"మీ ఇంటిలో వారిది ఎవరిదైన ఉంగరం నదిలో పడిపోయింది*?" అని ప్రశ్నించగా కేశవ్ తనదే పడిపోయినదని చెప్పుటయే గాక దాని గుర్తులు కూడా చెప్పుటచే ఆ ఫకీరు ఆ ఉంగరం కేశవ్ కు ఇచ్చెను. ఇక్కడ మనం గమనించి వలసినవి: నదిలో పడిపోయిన ఉంగరం ఆ ఫకీరుకు ఎలా లభించినది అది కూడ ఆరుమాసాల తరువాత, ఆ ఉంగరం కేశవ్ దేనని అతనికి ఎలా తెలుసు? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నల గానే మిగిలిపోతాయి. వచ్చినది త్రికాలజ్ఞుడు, మరియు త్రిలోకాలు సంబంధించిన సాయి బాబాయ్ అని మనం గ్రహిస్తే పై ప్రశ్నలు ఉత్పన్నమే కావు.

Source :- మున్నలూరి బోస్, ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్.

*శ్రీసాయి సచ్చరిత్ర*

*షిరిడీ యాత్రయొక్క లక్షణములు*

బాబా యాజ్ఞలేనిదే యెవరును షిరిడీ విడువ లేకుండిరి. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో ననుకొనని కష్టములు వచ్చుచుండెడివి. బాబా యాజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహాప్రకారము నడచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి యుదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను.

*తాత్యాకోతే పాటీలు*
ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్ గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా యిట్లనెను. "తొందర పడవద్దు. కొంచెమాగుము. సంత సంగతి యటుండనిమ్ము. పల్లెవిడిచి బయటకు పోవలదు." అతని యాతురతను జూచి "మాధవరావు దేశపాండేనయిన వెంట దీసికొని పొమ్మ"ని బాబా యాజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. రెండు గుర్రములలో నొకటి క్రొత్తది; మిక్కిలి చురుకైనది. అది రూ.300ల విలువ జేయును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తెను. కొంతదూరము పోయిన పిమ్మట కాలు బెణికి యది కూలబడెను. తాత్యాకు పెద్దదెబ్బ తగులలేదు. కాని తల్లి ప్రేమగల బాబా యాజ్ఞను జ్ఞప్తికి దెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కోల్హారు గ్రామమునకు పోవునపుడు బాబా యాజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను.

*ఐరోపాదేశపు పెద్దమనిషి*
బొంబాయనుండి ఐరోపాదేశపు పెద్దమనిషి యొకడు షిరిడీ వచ్చెను, నానా సాహెబు చాందోర్కరు వద్దనుంచి తననుగూర్చి బాబాకు ఒక లేఖను తీసికొని యేదో ఉద్దేశముతో షిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖమైన బస యేర్పరచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారిచేతిని ముద్దిడవలెనని మూడుసారులు మసీదులో ప్రవేశించ యత్నించెను. కాని బాబా అతనిని నిషేధించెను. క్రింద బహిరంగావరణములో కూర్చుండియే దర్శించవలెననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలెనని నిశ్చయించెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడ అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమమున గుర్రములు బాగుగనే పరుగెత్తినవి. సావుల్ బావి దాటిన వంటనే యొక త్రొక్కుడుబండి ఎదురు వచ్చెను. దానిని జూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడ సాగెను. టాంగా తలక్రిందులయ్యెను. పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసికొనుటకై కోపర్ గాం ఆసుపత్రిలో పడియుండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పొవుదురనియు జనులు గ్రహించిరి.

శ్రీ సాయి
శ్రీసాయిబాబాను సన్నిహితంగా సేవించిన భక్తులలో ఇద్దరు మాత్రమే బాబాతో తమకు గల అనుభవాల గురించి డైరీ వ్రాసుకున్నారు. వారు శ్రీజి.యస్.ఖపర్డే, శ్రీకాకాసాహెబ్ దీక్షిత్. శ్రీ ఖపర్డే 'శిరిడీ డైరీ' చాలామంది సాయిభక్తులకు సుపరిచితమే. శ్రీ ఖపర్డే ఇంగ్లీషులో వ్రాసుకున్న డైరీని మొదట శ్రీబి.వి.నరసింహస్వామి ప్రచురించారు. తర్వాత అది 'సాయిలీల' (ఇంగ్లీషు) పత్రికలో (1985-86) ధారావాహికంగా ప్రచురింపబడి, ఇప్పుడు శిరిడీ సంస్థానం వారి వద్ద పుస్తక రూపంలో లభిస్తోంది. కాని, కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ మాత్రం చాలామంది సాయిభక్తులకు(ముఖ్యంగా తెలుగువారికి) 1988 నాటికి అలభ్యంగానే ఉంది. శ్రీదీక్షిత్ తన డైరీని మరాఠీ భాషలో వ్రాసుకున్నారు. ఆ డైరీలో తాను 1909లో బాబాను దర్శించిన లగాయతు బాబా మహాసమాధి చెందేంతవరకూ, ఆ తర్వాత 1926లో ఆయన మరణించే ముందుదాకా కూడ తాను చూచిన, విన్న బాబా లీలలను వ్రాసుకున్నారు. ఆ డైరీ యొక్క ఆంగ్లానువాదం మద్రాసు నుండి చాలాకాలం క్రితం ప్రచురింపబడింది. కానీ, ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కావటంలేదు.

బాబాను ప్రత్యక్షంగా సేవించిన యన్.పి.అవస్థే గారి వద్దనుండి ఆ పుస్తకం యొక్క ప్రతి పూనాకు చెందిన యస్.యమ్.గార్జే అను సాయిభక్తునికి లభించింది. అక్కడక్కడ చెదలు తిని మొదటి, చివర రెండు పేజీలు పూర్తిగా చినిగిపోయివున్న ఆ పుస్తకాన్ని 1977లో శ్రీగార్జే 'శ్రీసాయిలీల’ ఎడిటర్ దృష్టికి తీసుకువచ్చారు. చిత్రమేమిటంటే శ్రీశిరిడీ సంస్థానం వారి అనుమతితో ఆ డైరీని ఇంగ్లీషులోనికి అనువదించి ప్రచురిస్తున్నట్టుగా ఆ పుస్తకం ఉపోద్ఘాతంలో అనువాదకుడు వ్రాసివున్నా, ఆ పుస్తకం మరో ప్రతి సంస్థానం గ్రంథాలయంలోగాని, మరెక్కడగానీ లభించలేదు. మొదటి, చివర పేజీలు చినిగిపోయి ఉండడంవల్ల ప్రచురణకర్తకు సంబంధించిన వివరాలు తెలియలేదు. సుమారు 140 పేజీలున్న ఆ డైరీలో 121 వివిధ సంఘటనలు, బాబా లీలల గురించి వ్రాయబడివుంది. అవి యెంతో ఆసక్తిదాయకమైనవే కాక, శ్రీసాయిచరిత్రను గురించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి తెస్తాయి. ఆ డైరీలోని కొన్ని భాగాలు 1977-78లో 'సాయిలీల'(ఇంగ్లీషు) పత్రికలో సీరియల్ గా ప్రచురింపబడ్డాయి. ఈ డైరీ గురించి దాని ఆంగ్లానువాదకుడు తన ఉపోద్ఘాతంలో యిలా వ్రాస్తున్నారు - "... ఈ డైరీ బాబా జీవితచరిత్ర గురించి సమాచారాన్నందించే మొట్టమొదటి ఆధారం. పెప్సీ యొక్క, యావలిన్ యొక్క డైరీలు వారివారి కాలాలకు సంబంధించి ఆంగ్లేయుల చరిత్ర రచనకు ఎలా ఉపయోగపడ్డాయో, అలాగే శ్రీహెచ్.యస్.దీక్షిత్ మరాఠీలోను, శ్రీజి.యస్.ఖపర్డే ఇంగ్లీషులోను వ్రాసుకున్న డైరీలు శ్రీసాయి చరిత్రకు విలువైన ఆధారాలు. బాబా లీలలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సాధకులు తమ గమ్యం చేరడానికి బాబా ఎలా దోహదం చేసేవారో విశదపడుతుంది. దీక్షిత్ డైరీ చదివే ఏ పాఠకునికైనా అదే లక్ష్యం కావాలి..." దీక్షిత్ డైరీ ఎంతో విలువైనది. ముఖ్యంగా క్రొత్తగా బాబా రక్షణలోకి వచ్చిన భక్తులకు ఇది ఎంతో సహాయకారి. తన భక్తుల యోగక్షేమాల బాధ్యత పూర్తిగా తానే వహిస్తానని బాబా యిచ్చిన హామీ కాకాసాహెబ్ దీక్షిత్ కు మాత్రమే పరిమితం కాదు. కానీ, (దీక్షిత్, ఖపర్డేలు తప్ప) బాబాను ప్రత్యక్షంగా సేవించి అలాంటి రక్షణే పొందిన దాసగణు వంటి చాలామంది ఇతర భక్తులు తమ అనుభవాలను, తమ ఆధ్యాత్మిక పురోగతిని డైరీ రూపంలో గ్రంథస్థం చేసుకోకపోవడం శోచనీయం. ఉపాసనీ బాబా కూడా ఎన్నో ఏళ్ళు బాబా పూర్తి సంరక్షణలో ఉన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉపాసనీబాబా క్రమబద్ధమైన డైరీ వ్రాసుకోకపోవడమేకాక, తరువాతి రోజుల్లో తాము మొదట ఏ సంవత్సరంలో బాబా వద్దకు వచ్చారో, బాబా వద్ద ఎంతకాలం ఉన్నారో కూడా మర్చిపోయారు. ఉదాహరణకు బాబా ఆదేశానుసారం ఉపాసనీ జీవితచరిత్ర 'ఉపాసనీ లీలామృతం' వ్రాసిన రచయిత ఉపాసనీ బాబా నాలుగు సంవత్సరాలు బాబా ఆజ్ఞ ప్రకారం శిరిడీలో ఉన్నట్లుగా పేర్కొన్నాడు. కానీ, ఆ తరువాత ఖపర్డే డైరీ, బాలకృష్ణ ఉపాసనీశాస్త్రి వద్దవున్న ఉత్తరాల సహాయంతో చేసిన పరిశోధన వల్ల శ్రీఉపాసనీ మహరాజ్ శిరిడీలో ఉండమని బాబా పెట్టిన 4 సంవత్సరాల గడువు పూర్తి చేయలేదనీ, కేవలం 3సం||లు మాత్రమే - అంటే జూన్ 1911 నుండి జూన్ 1914 వరకు- శిరిడీలో ఉన్నారనే విషయం బయటపడింది. ఆ తరువాత ఆయన (శ్రీఉపాసనీ) ఎన్నో సందర్భాలలో శిరిడీ సందర్శించినా, బాబా విధించిన ఆ నాలుగు సంవత్సరాల గడువు మాత్రం పూర్తి చేయలేదు. ఖపర్డే, దీక్షిత్ డైరీల వంటి ఆధారాల వల్లనే శ్రీసాయిభక్తుల జీవితాలకు సంబంధించిన అధ్యయనంలో ఇటువంటి విషయాలు వెలుగులోకి రావడం సాధ్యపడుతుంది. చారిత్రక సత్యాల నిర్ధారణకు ఇటువంటి డైరీలు ఎలా ఉపయోగపడతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

కానీ, జీవితచరిత్రలకు సంబంధించిన సంఘటనల నిర్ధారణకేగాక ఈ డైరీల అధ్యయనం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ డైరీలలోని కొన్ని భాగాల ప్రత్యేక అధ్యయనం వల్ల కొందరు ఎలా తమ ఆరోగ్యం, లౌకిక ఆధ్యాత్మిక విషయాలలో పురోగతి సాధించారో, ఈ డైరీలు చదివిన పాఠకులు గమనించగలరు. దీక్షిత్, ఖపర్డే డైరీల వల్ల ఇంత ప్రయోజనం ఉంది కనుకే వాటిని అనువదించి ప్రచురిస్తున్నాం.

మహల్సాపతి, తాత్యా, నానాచందోర్కర్

తర్వాత బాబాను అత్యంత సన్నిహితంగా సేవించిన ప్రముఖ భక్తులలో హరిసీతారాం దీక్షిత్ ను పేర్కొనాలి. ఈయన సన్నిహితులు చాలామంది ఈయనను 'కాకా' (- అంటే 'మామా' అని అర్థం) అని పిలిచేవారు. శ్రీసాయిబాబా కూడా దీక్షిత్ ను 'కాకా' అని పిలవడంతో ఈయన పేరు కాకాసాహెబ్ దీక్షిత్ గానే అందరికీ సుపరిచితం. శ్రీదీక్షిత్ బొంబాయిలో ప్రఖ్యాత న్యాయవాది. న్యాయవాదవృత్తిలోనే కాకుండా, రాజకీయ సాంస్కృతిక రంగాలలో కూడా ప్రముఖవ్యక్తిగా పేరొందాడు. బొంబాయి శాసనమండలి సభ్యుడుగా, బొంబాయి కార్పొరేషన్ కౌన్సిలర్ గా, బొంబాయి కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా, ఇలా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించాడు. 1906లో శ్రీదీక్షిత్ ఇంగ్లాండులో రైలు ఎక్కబోతూ, ప్రమాదవశాత్తూ ప్లాట్ ఫారంపై జారిపడ్డాడు. అప్పటినుండి కాలుబెణికి విపరీతంగా నొప్పిపెట్టసాగింది. ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం లేకపోయింది. నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా బాబా గురించి విని, 1909లో బాబాను దర్శించాడు.

శ్రీదీక్షిత్ మొదట బాబాను దర్శించింది తన కాలి బెణుకు నొప్పి తగ్గించుకోవడానికే అయినా, బాబా దర్శన మాత్రం చేతనే ఆయనలో ఎంతో పరివర్తన కలిగింది. బాబా వంటి సద్గురువును కాలినొప్పి వల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టమని అడిగేకన్నా, సంసార దుఃఖాన్నుండి విముక్తి కోరడం వివేకము, సముచితమూ అని తోచింది. అంతే! లక్షలు ఆర్జించి పెట్టే తన న్యాయవాదవృత్తినీ, సంసార వ్యాపకాలను త్యజించి, శిరిడీలోనే స్థిరపడి తన జీవితాన్ని సాయిసేవకు, ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేసాడు. శ్రీదీక్షిత్ శిరిడీలో తన నివాసం కోసం నిర్మించుకొన్న భవనం, అప్పట్లో సాయిభక్తులకు వసతి గృహంగానూ, తరువాత శిరిడీ సంస్థానం వారి భోజనశాలగాను, తరువాత కొంతకాలం సంస్థానం వారి ఫలహారశాలగానూ, ప్రస్తుతం మ్యూజియంగా సద్వినియోగపడుతోంది. శ్రీదీక్షిత్ 1910 నుండి 1918లో బాబా మహాసమాధి అయ్యేంతవరకూ, ఆ తరువాత తాను 1926లో దివంగతులయ్యే వరకూ శిరిడీలోనే ఉండి శ్రీసాయికి అత్యంత సన్నిహిత భక్తునిగా, సాయిబాబా సంస్థాన గౌ||కార్యదర్శిగా 'సాయిలీలామాసిక్' పత్రిక ప్రధాన నిర్వాహకునిగా ఎంతో సేవచేసారు. “కాకా బరువు బాధ్యతలన్నీ నేనే వహిస్తాను” అని బాబా ఒకసారన్నారు. ఈ మాటలు శ్రీదీక్షిత్ అనన్యచింతనతో బాబాను ఎలా శరణుపొందాడో తెలుపుతాయి. "కాకా యోగ్యుడు. అతనిమాట ప్రకారం నడుచుకో!" అని బాబా ఒకసారి 'శ్రీసాయిసచ్చరిత్ర' రచించిన హేమాద్పంతును ఆదేశించారు. శ్రీసాయి అద్భుత మహిమామృతాన్ని, లీలలనూ, తాను చవిచూడటమే కాకుండా, ఎందరో భక్తులు బాబా నుండి పొందిన అనుభవాలను స్వయంగా చూచాడు, విన్నాడు. వాటిలో కొన్ని తన డైరీలో వ్రాసుకొన్నాడు. రేపటినుండి ఆ అనుభవాలను చదువుకుందాం.
*సోర్స్: సాయిపథం వాల్యూం 1.*
*నిరంతరం శ్రీ సాయి నామ స్మరణ - సర్వపాప హర సర్వ అవస్థ రక్షకరం*

*రామేశ్వర అభిషేక ఫలం*..

ఒకసారి ఏకనాథుడు కాశీ వెళ్ళాడు. కాశీలోని గంగాజలంతో రామేశ్వర లింగానికి
అభిషేకం చేస్తే పుణ్యమని విన్నాడు. కాశీ నుండి కమండలంలో గంగను సేకరించి శిష్యబృందంతో రామేశ్వరం బయలుదేరాడు.అది మండు వేసవి. ఎండ తీవ్రతకు మనుషులే అల్లాడి పోతున్నారు. అది మిట్టమధ్యాహ్నం. ఏకనాథుడు వెళ్ళే మార్గం లో సేద తీరడానికి ఒక వృక్షం కూడా లేదు. జనసంచారం అసలే లేరు ఆ ఎండ వేడికి దాహమునకు తాకలేక ఒక గాడిద మూలగసాగింది. ఆ మూలుగు విన్న ఏకనాథుడు ఆ గాడిద చెంతకు వెళ్ళి రామేశ్వరంలో అభిషేకం చేద్దామనుకున్న గంగా జలమును ఆ గాడిద నోట్లో పోసి దాని దాహార్తిని తీర్చాడు. అది చూసి శిష్యులందరు ఆశ్చర్య పోగా *"ఈ గాడిద యే నాకు రామేశ్వరం*" అన్నాడు ఏకనాథుడు. సర్వ ప్రాణులను ఆ సర్వేశ్వర రూపాలుగా నెరిగిన ఏకనాధుడు ధన్య జీవి గదా! ఏకనాథుడు రామేశ్వరం దర్శించుకనే ఆ ఫలితాన్ని పొందాడు గాడిద దాహంతీర్చి.

*"నానా దాహం తీర్చిన సాయి*"..
*"నా నానా దాహంతో అలమటిస్తున్నాడు. అతనికి వెంటనే నీరు ఇవ్వ వలెను*"అన్నారు సాయిబాబా ఒకనాడు ద్వారకామాయిలో. ఆ సమయంలో నానాసాహెబ్ హరిశ్చంద్ర గుట్టమీద ఉన్నాడు. ఆ ప్రాంతానికి అతను తహశీల్దార్. ఒకరోజు అతని సిబ్బందితోను కావలసిన సరంజామతో గుట్టమీద నున్న దేవీ దర్శనార్ధమై బయలుదేరి గుట్ట సగ భాగమునకు చేరెను. అది మరియు వేసవి, భానుడు ఉగ్రరూపుడై ఉన్నాడు, ఏక్కడ ఒక చెట్టుగాని కాసేపు విశ్రాంతి తీసు కోవటానికి నీడ కూడ లేదు అటువంటి పరిస్థితుల్లో నానా బాగా అలసిపోయాను. తెచ్చికున్న నీరు, ఇతర తినుబండారాలు అయిపోయినవి. దాహానికీ తట్టుకోలేక ఆయాసపుతో ఒక బండపై కూర్చేనెను. బాబా ఎల్లవేళలా నానా కష్టకాలంలో ఆదు కునేవాడు. అప్పుడు ఒక బిల్లుడు కొండపై నుంచి క్రిందకు దిగుట చూసిన నానా అతనితో *"నాకు విపరీతమైన దాహంగా ఉన్నది. ఇక్కడ ఎక్కడైనా మంచి నీళ్ళు దొరుకుతాయా*?" అని అడుగగా ఆ బిల్లుడు ఒక చిరునవ్వు నవ్వి *"నీవు కూర్చున్న బండ క్రిందనే మంచి నీరు నది*" అని చెప్పగా నానా చెంతనున్న
బంట్రోతులు బండను తొలగించగా అచ్చట చల్లని, స్వచ్ఛమైన నీరు ప్రవహించుట గాంచి నానా తన దాహమును తీర్చుకొనేను. ఆ తర్వాత కొన్ని దినములు నానా షిరిడీ వెళ్ళగా *"నీకు హరిశ్చంద్రగుట్ట మీద నీరిచ్చినది ఎవరు*?" అని అడుగగా నానాకు ఆనాడు నీటి జాడ తెలిపిన భిల్లుడు బాబాయే నని గ్రహించాను.

Source :- మున్నలూరి బోస్, ముళ్ళపూడి పాండురంగ సాయినాధ్.

© Copyright శ్రీ షిరిడి సాయిబాబ అమృతధార